Thursday, October 08, 2009

కోట్లలో 'ఓషన్ పార్క్' లూటీ

హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని ఓషన్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పాల్పడిన భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వేలాది మందిని నమ్మించి ఆయన కోట్లాది రూపాయలు వసూలు చేసిన దగాచేసినట్లు తెలుస్తోందని అఫ్జల్ గంజ్ సబ్ ఇన్ స్పెక్టర్ గులాం రసూల్ మీడియాకు తెలిపారు. వెంకటేశ్వరరావు మోసంలో పడిన ఒక కస్టమర్ చేసిన ఫిర్యాదుతో అఫ్జల్ గంజ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, బుధవారం అరెస్టు చేశారు. వెయ్యేసి గజాల చొప్పున ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తానంటూ ఒక్కొక్కరి నుంచి వెంకటేశ్వరరావు 4.50 లక్షల చొప్పున వసూలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని సబ్ ఇన్ స్పెక్టర్ రసూల్ వెల్లడించారు. వెంకటేశ్వరరావు ట్రాప్ లో వేలాది మంది పడి ఉంటారని, కోట్లాది రూపాయల మేరకు ఇన్వెస్టర్లకు కుచ్చుటోపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నల్గొండ జిల్లాలోని రాచకొండలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నట్లు వేలాది మందిని నమ్మించి మూడేళ్ళ క్రితమే కోట్లాది రూపాయలు వసూలు చేశారు. మూడేళ్ళయినా వెంకటేశ్వరరావు ఆ వెంచర్ ను అభివృద్ధి చేయలేదు. సరికదా కనీసం వెంచర్ వేసిన భూమి ఎక్కడ ఉందన్నది కూడా కస్టమర్లకు ఆయన చూపించలేదు. ఈ క్రమంలో కొందరు ఇన్వెస్టర్లు తమకు అభివృద్ధి చేసి ఇస్తామన్న భూమినైనా ఇవ్వాలని, లేదా తమ సొమ్మును వాపస్ చేయాలంటూ వత్తిడి చేయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు కొందరు ఇన్వెస్టర్లను నల్గొండ జిల్లా రాచకొండ తీసుకువెళ్ళి, వారి కోసం అభివృద్ధి చేస్తున్న భూమి ఇదే అంటూ చూపించాడు. అయితే, అది ప్రభుత్వ భూమి అని తరువాత తెలిసి, వెంకటేశ్వరరావు చేతిలో మోసపోయినట్లు గుర్తించిన వారు కోర్టును ఆశ్రయించారు. ఇన్వెస్టర్ల ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు ఓషన్ పార్క్ ఎండి వెంకటేశ్వరరావుపై ఫిర్యాదు నమోదు చేయాల్సిందిగా అఫ్జల్ గంజ్ పోలీసులను ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని బుధవారంనాడు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించినట్లు అఫ్జల్ గంజ్ సబ్ ఇన్ స్పెక్టర్ గులాం రసూల్ తెలిపారు.

No comments:

Post a Comment